Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిటర్‌కు షాక్
- తండ్రి, కుమార్తెల పేరుతో జాయింట్ ఫిక్స్‌డ్ డిపాజిట్
- కాలపరిమితి ముగియడంతో బ్యాంకుకు వెళ్లిన తండ్రి, కుమార్తెలు
- డబ్బు ఎప్పుడో విత్ డ్రా అయిందని చెప్పడంతో కంగు తిన్న వైనం
కాలపరిమితి ముగియక ముందే తనకు తెలియకుండా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ విత్‌డ్రా కావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కు చెందిన ఓ ఖాతాదారుడు షాక్‌కు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం పెంజర్ల గ్రామానికి చెందిన మామిడి యాదిరెడ్డి నందిగామ మండల కేంద్రంలోని పీఎన్‌బీ శాఖలో 4 లక్షలు డిపాజిట్ చేశారు. తన కుమార్తె రమాదేవితో కలిసి జాయింట్ అకౌంట్‌లో 2012లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. 2017లో కాపరిమితి ముగియడంతో సొమ్ము విత్‌డ్రాకు బ్యాంక్‌కు వెళ్లారు. అయితే 2016లోనే ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఖంగుతిన్నారు. తమకు తెలియకుండా ఎలా విత్‌డ్రా చేశారని ప్రశ్నించగా బ్యాంక్ అధికారులు తమవద్ద ఆధారాలున్నాయని చెప్పడంతో బాధితులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
‘జాయింట్ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని తన తండ్రి ఒక్కడి సంతకంతోనే ఎలా విత్‌డ్రా చేస్తారు’ అని యాదిరెడ్డి కుమార్తె రమాదేవి ప్రశ్నిస్తున్నారు. తన తండ్రిని అమాయకుడిని చేసి బ్యాంక్ అధికారులే డబ్బు గల్లంతు చేశారని ఆరోపించారు. పోలీసులే న్యాయం చేయాలని కోరారు. కాగా, బాధితుల నుంచి ఫిర్యాదు అందిందని, విచారణ చేపడతామని నందిగామ ఎస్‌ఐ నర్సింహారెడ్డి తెలిపారు. విషయాన్ని బ్యాంక్ శాఖ మేనేజర్ అమరేష్ వద్ద ప్రస్తావించగా ‘తన డిపాజిట్ బాండ్ పోయిందని యాదిరెడ్డి 2015లో చెప్పడంతో డూప్లికేట్ బాండ్ ఇచ్చాం. ఆయన 2016లో డూప్లికేట్ బాండ్‌తో డబ్బు విత్‌డ్రా చేసి తీసుకున్నారు. జాయింట్ అకౌంట్ అయినప్పటికీ పాత ఖాతాదారుడు కావడంతో నమ్మకంతోనే డబ్బు ఇచ్చాం’ అని తెలిపారు.