karunanidhi: తెనాలి శిల్పులు తీర్చిదిద్దిన కరుణానిధి విగ్రహాలు!
- కాలువగట్టుపై విగ్రహాల ప్రదర్శన
- ఫైబర్ గ్లాస్ తో కేవలం 13 రోజుల్లోనే రూపొందిన వైనం
- చెన్నై మెరీనా బీచ్ కి తరలింపు
అది గుంటూరు జిల్లా తెనాలిలోని తూర్పు కాలువకట్ట..
రకరకాల భంగిమలలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి విగ్రహాలు అక్కడ కొలువుదీరాయి.
ఆ మార్గాన వెళ్లిన పట్టణ వాసులంతా వాటిని చూసి ఆ శిల్పకళా నైపుణ్యానికి అచ్చెరువొందారు.
ఈ విగ్రహాలను తెనాలికి చెందిన ఇద్దరు శిల్పులు రూపొందించారు. జీవం ఉట్టిపడుతున్నట్టుగా.. అచ్చం కరుణానిధినే చూసినట్టుగా ఉన్న ఈ విగ్రహాలను స్థానికులు చూసి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలను ఎంతగానో ప్రశంసించారు. ఫైబర్ గ్లాస్ తో కేవలం 13 రోజుల్లోనే వీటిని రూపొందించడం విశేషం.
వివిధ పరిమాణాల్లో తయారు చేసిన 10 విగ్రహాలను చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆయన సంస్మరణ దినం నాడు ప్రదర్శించనున్నారు. ఈ విగ్రహాలలో రెండింటిని ఈ నెల 22న ప్రతిష్టించనున్నారు. మధురై జిల్లా తిరుమంగళం, తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడిలో సంస్మరణ సందర్భంగా డి.ఎం.కె కార్యకర్తలు వీటిని తయారు చేయించారు. ఈ విగ్రహాలను మెరీనా బీచ్ లో ప్రదర్శనకుగాను చెన్నైకు తరలించారు.