Navjot Singh Sidhu: వారు చేస్తే న్యాయం... అదే నేను చేస్తే అన్యాయమా?: విమర్శకులపై సిద్ధూ ఫైర్
- వాజ్ పేయి, మోదీ పాక్ గతంలో పాక్ వెళ్లారన్న సిద్ధూ
- వాళ్లకు లేని అభ్యంతరం తనకెందుకని మండిపాటు
- సిద్దూ-బజ్వా ఆలింగనంపై కొనసాగుతున్న రచ్చ
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై ఎదురవుతున్న విమర్శలకు పంజాబ్ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా స్పందించారు. 1999లో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి పాకిస్తాన్ లోని లాహోర్ కు బస్సు యాత్ర చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సిద్ధూ గుర్తుచేశారు. ‘1999లో లాహోర్ బస్సు యాత్ర చేసిన వాజ్ పేయి.. భారత్ ను సందర్శించాల్సిందిగా పాక్ సైనిక నియంత ముషారఫ్ ను ఆహ్వానించారు. 2014లో నరేంద్ర మోదీ కూడా తన ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించారు’ అని సిద్ధూ తెలిపారు.
వారంతా కలసి మాట్లాడుకున్నప్పుడు, కరచాలనం చేసినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ఆహ్వానం లేకుండా పాక్ లో దిగి షరీఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని సిద్ధూ గుర్తుచేశారు. తాను భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి కోసమే ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లానని సిద్ధూ స్పష్టం చేశారు.
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి సిద్ధూ పాక్ రాజధాని ఇస్లామాబాద్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆ దేశపు ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ జావేద్ బజ్వాను సిద్ధూ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ ఆనందంగా, నవ్వుతూ కనిపించడంపై కొందరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. పంజాజ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా బజ్వాను సిద్దూ ఆలింగనం చేసుకోవాల్సింది కాదని వ్యాఖ్యానించారు.