Imran Khan: గద్దెనెక్కగానే... నవాజ్ షరీఫ్ కు తొలి షాక్ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్!
- నవాజ్, మరియంలు దేశం వీడకుండా చర్యలు
- ఆయన కుమారులు పారిపోయిన నేరగాళ్లు
- రెడ్ వారెంట్ల జారీకి ఇమ్రాన్ క్యాబినెట్ నిర్ణయం
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్, తన తొలి సమావేశంలోనే మాజీ ప్రధాని, ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్ కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. నవాజ్ తో పాటు ఆయన కుమార్తె మరియంలు దేశం విడిచి వెళ్లకుండా ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో పెట్టడంతో పాటు ఆయన కుమారులైన హుస్సాన్, హుస్సేన్ లను, మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ లను దేశం నుంచి పారిపోయిన నేరగాళ్లుగా పేర్కొంటూ, రెడ్ వారెంట్లను జారీ చేశారు.
ఈ విషయాన్ని వెల్లడించిన పాక్ సమాచార మంత్రి ఫవద్ చౌధురి, అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరిగిందని, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, పొదుపు చర్యలపై చర్చించామని ఫవద్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం నవాజ్ కుమారులు లండన్ లో ఉండగా, అక్కడ వారు కొనుగోలు చేసిన ఆస్తులపై నివేదిక ఇవ్వాలని బ్రిటన్ గవర్నమెంట్ ను పాకిస్థాన్ కోరాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.