Gujarat: ఈ స్వీట్ నిజంగా ‘బంగారమే’.. కేజీ రూ.9 వేలు పెట్టి కొంటున్న జనం!
- ఖరీదైన స్వీట్ ను అమ్ముతున్న సూరత్ షాపు
- 24 కేరట్ల బంగారం పూతతో అమ్మకం
- షాపుకు క్రేజ్ వచ్చిందంటున్న యజమాని
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదట మనం స్వీట్ కే ఆర్డర్ ఇస్తాం. తీపి అన్నది మన కుటుంబాల్లో అంతగా పెనవేసుకుపోయింది. పుట్టినరోజు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది స్వీట్లు కొంటూ ఉంటారు. ఈ స్వీట్ ధర మామూలుగా అయితే కేజీ రూ.500 నుంచి 800 వరకూ ఉంటుంది. ఇక డ్రై ఫ్రూట్ స్వీట్స్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఉంటుంది. కానీ గుజరాత్ కు చెందిన ఓ స్వీట్ షాపు మాత్రం కేజీ స్వీట్ ను ఏకంగా రూ.9,000 కు అమ్ముతోంది.
త్వరలో రానున్న రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ ఖరీదైన మిఠాయిని సూరత్ లోని షాపు తయారుచేసింది. కేవలం మిఠాయికి అంత ఎవరు ఖర్చుపెడతారు? అదేమన్నా బంగారమా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ స్వీట్ ను నిజంగానే బంగారం పూతతో తయారుచేశారు. ఇందుకోసం 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం వాడారు.
అది సరే కానీ ఇంత ధర పెట్టి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? అనేగా మీ డౌటు. ఈ స్వీట్ ను ప్రారంభించాక తమ షాపుకు వినియోగదారుల తాకిడి పెరిగిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఈ స్వీట్ అమ్మకాలు కూడా జోరందుకుంటున్నాయని వెల్లడించాడు.