Kerala: పది నిమిషాల్లో జెండా ఎగరేస్తారనగా వరద ముంచెత్తింది... కేరళ యువతి దయనీయ గాధ!
- కేరళను ముంచెత్తిన వరదలు
- సర్వం కోల్పోయిన బాధితులు
- ఇప్పుడు తగ్గిన వరద
- వెలుగులోకి వస్తున్న వాస్తవ పరిస్థితి
కేరళలో జలవిలయం ఎలాంటి పెను విపత్తును సృష్టించిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. వరదలు కొంతమేరకు తగ్గుముఖం పట్టగా, జాతీయ మీడియా యావత్తూ కేరళకు చేరి, వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తెస్తోంది. చెంగన్నూరు సమీపంలోని ఓ గ్రామంలో వివాహిత యువతి చెప్పిన వివరాల ప్రకారం, ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం వేళ, మరో పది నిమిషాల్లో స్కూల్లో జెండా ఎగురవేస్తారనగా, వరద తన్నుకొచ్చింది.
క్షణక్షణానికీ నీరు పెరుగుతూ ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, గ్రామస్థులంతా సమీపంలోని పాఠశాలలోకి వెళ్లిపోయారు. రహదారిపై దాదాపు ఏడు అడుగుల మేరకు నీరు ప్రవహించడంతో, ఇళ్లన్నీ మునిగిపోయాయి. కట్టుబట్టలతో బయటపడ్డారు. విలువైన సామానంతా వరదనీటి పాలైంది. ఎన్నో వస్తువులు కొట్టుకుపోయాయి.
ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాలు సైతం నీటి ముంపులో చిక్కుకుపోయాయి. ఆ గ్రామస్థులు చేరుకున్న స్కూల్ లోపలికీ నీరు రాగా, వారంతా, అదే భవంతిపైకి ఎక్కి సహాయక బృందాలు వచ్చేంత వరకూ వేచి చూశాయి. 17వ తేదీ వరకూ ప్రవహించిన వరద నీరు, ఆపై క్రమంగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం తిరిగి ఇళ్లల్లోకి చేరుకున్న వీరు, పోయిన సామాన్లను తలచుకుని కన్నీరు పెడుతున్నారు.
తన ల్యాప్ టాప్, ఇంట్లోని టీవీ, ఫ్రిజ్ తదితర విలువైన వస్తువులు నాశనం అయ్యాయని, పుస్తకాలన్నీ కొట్టుకుపోయాయని ఆ యువతి వాపోయింది. ఇప్పుడిక తమ జీవనం ఎలా సాగాలా అని మధనపడింది. 14వ తేదీన భారీ వర్షం పడటంతో నాటి నుంచే కరెంట్ తీసేశారని, ఇంతవరకూ రాలేదని చెప్పింది. తమకు అందింది అరకొర సాయమేనని, కనీసం తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక మూడు రోజులు అవస్థ పడ్డామని తనకు ఎదురైన అనుభవాన్ని కన్నీటితో చెప్పుకొచ్చింది.