Amaravati: ముందుగా అన్నీ తెలుసుకుని మాట్లాడాలి!: 'అమరావతి బాండ్ల' విమర్శకులపై కుటుంబరావు

  • అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన 
  • ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయడంపై విమర్శలు 
  • క్రిసిల్ ఈ బాండ్లకు ఏ+ రేటింగ్ ఇచ్చిందన్న కుటుంబరావు

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణ నిమిత్తం ఇటీవల బాంబే స్టాక్ ఎక్చేంజిలో సీఆర్డీఏ రూ. 2000 కోట్లకు 'అమరావతి బాండ్ల'ను జారీచేయగా అనూహ్య స్పందన వచ్చిన విషయం మనకు తెలిసిందే. పెట్టుబడిదారుల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్ల వున్న నమ్మకానికి ప్రతీకగా బాండ్లు అతి తక్కువ సమయంలో సబ్ స్క్రైబ్ అయి, సూపర్ హిట్టయ్యాయి. అయితే, ఈ బాండ్లకు ఇస్తున్న 10.32 శాతం వడ్డీ చాలా ఎక్కువని, అంత వడ్డీ ఇచ్చి అప్పు తెచ్చుకోవలసిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు విమర్శలు మొదలెట్టాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తాజాగా దీనిపై స్పందించారు. అమరావతి నిర్మాణానికి ఇప్పుడు నిధుల సమస్య వుందని, వీటిని రకరకాల మార్గాల ద్వారా సమీకరించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలో అమరావతి బాండ్ల జారీ ఒక ప్రక్రియ అని, ఈ బాండ్ల వడ్డీ రేటుపై కొందరు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను బట్టి క్రిసిల్ ఈ బాండ్లకు ఏ ప్లస్ రేటింగ్ ఇచ్చిందని, అలాగే 10.32 శాతం వడ్డీ ఇచ్చుకోవడానికి కూడా ఆమోదం తెలిపిందని కుటుంబరావు వివరించారు.

అసలు ఇంతకంటే తక్కువ వడ్డీకి ఎవరైనా అప్పు ఇప్పించగలిగితే సంతోషమేనని, ఆ రేంజ్ వడ్డీ మినహాయిస్తామని చెప్పారు. ఇటీవల జీహెచ్ఎంసీ జారీ చేసిన బాండ్లపై స్పందిస్తూ, వాటికీ, అమరావతి బాండ్లకు చాలా తేడా వుందని అన్నారు. అమరావతి బాండ్లను విమర్శించేవారు ముందుగా ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలని, బాండ్ల జారీలో తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని, ఏదిపడితే అది మాట్లాడకూడదని ఆయన హితవు పలికారు. పెట్టుబడిదారుల్లో మంచి నమ్మకాన్ని కలిగించిన ఈ బాండ్ల పట్ల ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవలసిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News