Madhya Pradesh: బాలికపై అత్యాచారం చేస్తుంటే.. నిందితులను కరిచి కరిచి అడ్డుకున్న శునకరాజం!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- అత్యాచారం చేస్తుంటే పెంపుడు కుక్కను పిలిచిన బాధితురాలు
- వారిపై దాడి చేసి పారిపోయేలా చేసిన శునకం
శునకం ఎంత విశ్వాసపాత్రమైనదో మరోసారి తెలియజేస్తున్న ఘటన ఇది. తన యజమానిని అత్యాచారం చేస్తుంటే, ఆ కామాంధులను కరిచి కరిచి, వారు పారిపోయేలా చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా, ఖరాయి సమీపంలో జరిగింది. ఆ గ్రామంలోని ఓ మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన రేషు అహిర్వార్, పునీత్ అహిర్వార్ అనే యువకులు, ఆమెను లాక్కొని పశువుల దాణాను దాచే గదిలోకి తీసుకెళ్లారు.
అక్కడ ఆమెపై అఘాయిత్యానికి యత్నించారు. ఆ సమయంలో బాలిక, తన పెంపుడు కుక్కను పిలిచింది. దీంతో ఆగమేఘాల మీద వచ్చిన ఆ కుక్క వారిపై దాడి చేసింది. దీంతో వారిద్దరూ బతుకుజీవుడా అని పారిపోక తప్పలేదు. తన యజమానికి ఆపద కలిగిందన్న భావనలో, ఆ శునకం పదే పదే అరుస్తూ, స్థానికులను సైతం అప్రమత్తం చేసింది. కుక్క మొరుగుతూ ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు, అక్కడికి వచ్చి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.