Asian Games: ఆసియా క్రీడల్లో భారత్ కు నిరాశ.. బ్యాడ్మింటన్ మహిళల టీమ్ ఔట్!
- ఆసియా క్రీడల్లో భారత్ కు ఎదురుదెబ్బ
- క్వార్టర్ లోనే వెనుదిరిగిన మహిళల బ్యాడ్మింటన్ టీమ్
- జపాన్ చేతిలో ఘోర పరాజయం
భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు ఆసియా క్రీడల్లో చేతులెత్తేసింది. స్వర్ణ పతకం తెస్తుందనుకున్న జట్టు క్వార్టర్ ఫైనల్ లోనే చతికిలపడింది. ఈ రోజు జరిగిన క్వార్టర్ లో ఇండియా టీమ్ జపాన్ తో తలబడి, ఓటమితో వెనుదిరిగింది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవ్వడంతో మహిళల టీమ్ ఈవెంట్ నుంచి భారత నిష్క్రమించాల్సి వచ్చింది.
పీవీ సింధు 21-18, 21-19తో యమగూచిపై విజయం సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత డబుల్స్‌లో సిక్కిరెడ్డి- ఆరతి 15-21, 6-21తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో భారత్ ఆధిక్యానికి తెరపడింది. మరో సింగిల్స్‌లో సైనా 11-21, 25-23, 16-21 తేడాతో ఒకుహార చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మరో డబుల్స్‌లో సింధు-పొన్నప్ప జోడీ కూడా ఓడిపోయింది. దీంతో ఈ ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ ఈవెంట్లో భారత మహిళల పోరుకు తెర పడింది. ఏ పతకం లేకుండా నిరుత్సాహంగా మహిళల టీమ్ వెనుదిరిగింది.