Tamilnadu: స్టాలిన్ వర్సెస్ అళగిరి.. చెన్నైలో లక్ష మందితో బలప్రదర్శనకు అన్న ఏర్పాట్లు!

  • సెప్టెంబర్ 5న చెన్నైలో శాంతి ర్యాలీ
  • కరుణ మరణం తర్వాత చురుగ్గా అళగిరి
  • డీఎంకే పై పట్టుకోసం ప్రయత్నాలు

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ పగ్గాల కోసం అన్న అళగిరి, తమ్ముడు స్టాలిన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా తన బలాన్ని నిరూపించుకునేందుకు చెన్నై నగరంలో సెప్టెంబర్ 5న దాదాపు లక్ష మందితో శాంతి ర్యాలీ నిర్వహిస్తానని అళగిరి ప్రకటించారు.

ఇటీవల కరుణానిధి చనిపోయిన సందర్భంగా అళగిరి మాట్లాడుతూ.. స్టాలిన్ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రమేనని, చీఫ్ కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే బలహీనంగా తయారయిందని దుయ్యబట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.


డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన వారసుడిగా ఎంకే స్టాలిన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో కరుణ నిర్ణయాన్ని పెద్ద కుమారుడు అళగిరి అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. ఓ సందర్భంలో అయితే, స్టాలిన్ మరో 3 నెలల్లో చనిపోతాడంటూ కరుణానిధితో అళగిరి ఆవేశంగా అన్నారట. ఈ విషయాన్ని కరుణానిధే బయటపెట్టారు. కొడుకు గురించి అలాంటి మాటల్ని ఏ తండ్రి మాత్రం సహిస్తాడని, స్టాలిన్ పై అళగిరి ఎందుకు అలాంటి ద్వేషం పెంచుకున్నాడో తెలియదని కరుణానిధి అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కరుణ 2014, జనవరిలో అళగిరి, ఆయన మద్దతుదారుల్ని డీఎంకే నుంచి బహిష్కరించారు. క్షిణ తమిళనాడులో డీఎంకే కేడర్ పై అళగిరికి మంచిపట్టు ఉండేది. అయితే అళగిరి వర్గానికి చెందిన నేతలందరినీ స్టాలిన్ పార్టీ నుంచి సాగనంపారు. ఈ నేపథ్యంలో తాను దక్షిణ తమిళనాడుకే పరిమితం కాననీ, రాష్ట్రమంతా తనకు మద్దతుదారులు ఉన్నారని నిరూపించుకునేందుకు ఆళగిరి బల ప్రదర్శనకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

Tamilnadu
DMK
MK Alagiri
stalin
party
politics
peace rally
  • Loading...

More Telugu News