Special Category Status: హోదా కోసం ఆగిన మరో ప్రాణం.. సీఎం కు లేఖ రాసి ఆత్మహత్య!
- గుమాస్తా యానాదయ్య బలవన్మరణం
- ప్రకాశం జిల్లా కమ్మపాలెంలో ఘటన
- సీఎంకు లేఖ రాసి ప్రాణాలు తీసుకున్న వైనం
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా కమ్మపాలెంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కడప జిల్లా రాజంపేటకు చెందిన పైడికొండల యానాదయ్య(47) పదేళ్ల క్రితం ప్రకాశం జిల్లాకు వలస వచ్చాడు. ఓ సిమెంట్ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్న యానాదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మాటమార్చడం, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోదా విషయంలో ఐక్యత లేకపోవడంపై యానాదయ్య మనస్తాపం చెందాడు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి పురుగుల మందు తాగాడు.
దశరాజుపల్లి రోడ్డు ఫ్లైఓవర్ కింద ఆదివారం యానాదయ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘కేంద్ర ప్రభుత్వం ఏపీని చిన్నచూపు చూసింది. నాకు జరిగిన అన్యాయం నా పిల్లలకు జరగటానికి వీలులేదు. నా ఆత్మహత్యతో అయినా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం కలసి పోరాడుతాయనీ, కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని ఆశిస్తూ సెలవు’ అని రాశాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్థన్ ను యానాదయ్య లేఖలో కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.