Krishna District: కృష్ణా జిల్లాలో కుంభవృష్టి... వేల ఎకరాల మాగాణి సర్వనాశనం!
- రెండు రోజులుగా భారీ వర్షాలు
- దయనీయంగా తిరువూరు నియోజకవర్గం
- పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వేల ఎకరాల మాగాణి, మెట్ట భూములు సర్వనాశనమయ్యాయి. ముఖ్యంగా తిరువూరు ప్రాంతంలో పరిస్థితి దయనీయంగా ఉంది. నియోజకవర్గంలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరువూరు నుంచి మల్లేల, చౌటపల్లి రహదారుల్లో ఉన్న వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది.
అక్కపాలెం, నునుకుళ్ల, కోకిలంపాడు రహదారి మీదుగా వాగు ప్రవహిస్తుండగా, రహదారి కోతకు గురైంది. దీంతో ఆ దారిలో వాహనాల రాకపోకలను అధికారులు, పోలీసులు నిలిపివేశారు. ఈ వరద నీరంతా మాగాణి, మెట్ట భూముల మీదుగా సాగుతోంది. వరి, పెసర, మినుము, కంది, పత్తి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం కలిగిందని, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.
కాగా, భారీ వర్షాలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీఐఐసీ కాలనీ జలదిగ్బంధంలో ఉంది. టైలర్ పేటలోని ఆర్సీఎం పాఠశాల వెనుక గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నందిగామ మండలం దాములూరు వద్ద వైరా, మాగల్లు, కూచి వాగులు పొంగి పొరలుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఘంటసాలలో 18.5 మి.మీ, చల్లపల్లిలో 22.2 మి.మీ, అవనిగడ్డలో 13.7 మి.మీ కోడూరులో 12 మి.మీ, నాగాయలంకలో 11.3 మి.మీ వర్షపాతం నమోదైంది.