Srisailam: తగ్గిన వరద... శ్రీశైలం డ్యామ్ మూడు గేట్ల మూసివేత!
- ఇన్ ఫ్లో 2,31,799 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 2,08,190 క్యూసెక్కులు
- జలాశయంలో 882.10 అడుగుల మేరకు నీరు
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కాస్తంత నెమ్మదించడంతో శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లను అధికారులు మూసివేశారు. శనివారం నాడు ఆరు గేట్లను, ఆపై ఆదివారం నాడు మరో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు, ప్రస్తుతం ఐదు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 2,31,799 క్యూసెక్కులుగా ఉండగా, స్పిల్ వే, విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు 2,08,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 882.10 అడుగుల మేరకు నీరుంది. కర్ణాటకలో వర్షాలు పడుతూ ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడు అడుగుల మేరకు జలాశయంలో ఖాళీ ఉంచుతున్నామని అధికారులు వెల్లడించారు.