basiran: ఢిల్లీని వణికించిన ‘మమ్మీ’ డాన్.. 45 ఏళ్లకు అరెస్ట్ చేసిన పోలీసులు!
- 113 కేసులు పడ్డా అరెస్ట్ కాని బసిరన్
- ఏడాది కాలంగా పరారీలో ఉన్న వైనం
- తొలిసారి అరెస్ట్ చేయగలిగిన పోలీసులు
60 సంవత్సరాల ఆడవాళ్లంటే రామా.. కృష్ణా.. అంటూ గడిపేస్తారని అనుకుంటాం. ఆరోగ్యం ఇంకా మెరుగ్గా ఉంటే ఇంట్లో పనులు చేసుకుంటూ మనవళ్లు, మనవరాళ్లను ఆడించుకుంటూ ఆనందంగా గడిపేస్తారు. అయితే రాజస్తాన్ కు చెందిన బసిరన్(62) మాత్రం అలాంటి పెద్దావిడ కానేకాదు. ఎందుకంటే హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఆమె ఢిల్లీలో ఏకంగా మాఫియాను నడిపేస్తోంది. ఈ ముఠా సభ్యులంతా ఆమెను గౌరవంగా ‘మమ్మీ’ అని పిలుస్తారట!
ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మర్డర్లు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, దొంగతనాలు, అక్రమ అమ్మకాలు, చైన్ స్నాచింగ్ సహా ఈ ముఠా చాలా నేరాలకు పాల్పడింది. గత 45 ఏళ్లుగా ఈ మాఫియాను నడిపిస్తున్న బసిరన్ పై 113 కేసులు నమోదయ్యాయి. ఆమె 8 మంది కొడుకులు ఈ మాఫియాను నడపడంలో కీలకంగా వ్యవహరించేవారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బసిరన్ రాజస్తాన్ నుంచే నడిపించేది. ఈ ముఠా ఢిల్లీలోని ప్రభుత్వ బోరింగులను ఆక్రమించుకుని ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా అమ్ముకుని సొమ్ము చేసుకునేది. ఇంత జరిగినా వీరిని ప్రశ్నించే ధైర్యం అక్కడి అధికారులకు లేకపోయింది. గత 45 ఏళ్లలో ఒక్క పోలీస్ అధికారి కూడా బరిసన్ ను అరెస్ట్ చేయలేకపోయారు.
దాదాపు 8 నెలల క్రితం ఈ గ్యాంగ్ ఓ వ్యక్తిని హత్యచేశాక పెట్రోల్ పోసి కాల్చిచంపింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో బసిరన్ అందుబాటులో లేకుండా పోయింది. కోర్టు ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా ప్రకటించి అరెస్ట్ చేయాలని మే నెలలో పోలీసులను ఆదేశించింది. దీంతో బసిరన్ గ్యాంగ్ పై నిఘా పెట్టిన అధికారులు శనివారం ఆమె బంధువులను కలుసుకునేందుకు ఢిల్లీకి రహస్యంగా వచ్చినట్లు గుర్తించారు. పక్కాగా వల పన్నిన అధికారులు సంగమ్ విహార్ లో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.