godavari: శాంతించిన ఉగ్రగోదావరి.. జల దిగ్బంధంలోనే పలు లంకలు
- నెమ్మదించిన ప్రవాహ వేగం
- 11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్న అధికారులు
- నానా ఇబ్బందులు పడుతున్న కోనసీమ లంక గ్రామస్తులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది కొంచెం శాంతించింది. ప్రవాహవేగం కాస్త నెమ్మదించింది. అయినప్పటికీ వరద ఉద్ధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బ్యారేజీలో 12.7 అడుగుల నీటిమట్టం ఉండగా... అధికారులు 11 లక్షల 17 వేల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
బ్యారేజీ నుంచి భారీ ఎత్తున వరద నీటిని వదులుతుండటంతో... దిగువన కోనసీమలో ఉన్న పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అయినవిల్లి, పి.గన్నవరం, ఐ.పోలవరం, అల్లవరం, ముమ్మిడివరం మండలాల్లోని లంకలు నీటి ముంపులో ఉన్నాయి. కాజ్ వేలపై నీరు ప్రవహిస్తుండటంతో ... రాకపోకలు సాగించడానికి లంకవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట, రావులపాలెం, కపిలేశ్వరం మండలాల్లో ఉద్యానవన పంటలు, అరటి తోటలు నీట మునిగాయి. పోలవరం ఎగువన ఉన్న విలీన మండలాల్లో వరద తీవ్రతకు గిరిజన గూడేలకు రాకపోకలు నిలిచి పోయాయి.