attack: భార్యాభర్తల గొడవ.. అడ్డమొచ్చిన అన్నను కడతేర్చిన తమ్ముడు!

  • కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ఘోరం
  • నచ్చజెప్పిన అన్నపై కర్రతో దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

గొడవలతో కాపురాన్ని నాశనం చేసుకోవద్దని నచ్చజెప్పిన అన్నను ఓ ప్రబుద్ధుడు హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా భార్యపై తీవ్రంగా దాడిచేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక్కడి గడిగవారహళ్లి గ్రామంలో శ్రీనివాస రెడ్డి, సరస్వతమ్మ దంపతులు కలసి ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసగా మారిన అతను భార్యను తరచూ కొట్టేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన శ్రీనివాస రెడ్డి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో అన్న ఆంజనేయ రెడ్డి తమ్ముడికి నచ్చజెప్పి, సరస్వతమ్మను ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే శనివారం ఉదయం మద్యం తాగి అన్న ఇంటి దగ్గరకు చేరుకున్న శ్రీనివాస రెడ్డి.. ఓ కర్రతో ఆంజనేయరెడ్డిపై తీవ్రంగా దాడిచేశాడు. ఆయన స్పృహ కోల్పోయి పడిపోవడంతో భార్యను కూడా కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఈ ఆరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు అక్కడికి రాగానే శ్రీనివాస రెడ్డి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందజేసిన స్థానికులు.. వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే కర్ర బలంగా తలకు తగలడంతో ఆంజనేయరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సరస్వతమ్మ ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై ఆంజనేయరెడ్డి కుమారుడు రాహుల్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

attack
brother
Karnataka
chikballapura
Police
  • Loading...

More Telugu News