BULANDSHAHR: అభిమానం హద్దులు దాటితే అంతే మరి.. మోదీ, యోగి ఫొటోలకు కూడా దండలేసేసిన మున్సిపాలిటి!
- యూపీలోని బులంద్ షెహర్ లో ఘటన
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వాకం
- ఫొటోలు వైరల్ గా మారడంతో దండల తొలగింపు
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షెహర్ మున్సిపాలిటి నేతలు, సిబ్బంది చేసిన ఓ పని కారణంగా ఈ ప్రాంతం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. గతేడాది యూపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అక్కడి బీజేపీ నేతలకు జాతీయ నేతలను గౌరవించాలన్న ఆలోచన వచ్చింది. ఐడియా వచ్చిందే తడవుగా ఐదారు పూల మాలలను తెప్పించారు.
గోడపై ఉన్న మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటాలకు చకచకా పూల మాలలు వేశారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఖాళీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలకు పూల దండలు వేసేశారు. అనంతరం మున్సిల్ చైర్మన్ మనోజ్ గార్గ్ తో ఇతర సభ్యులు దర్జాగా కూర్చుని గ్రూప్ ఫొటోలు కూడా దిగారు. ఈ ఫొటో మీడియా చేతికి చిక్కడంతో వైరల్ గా మారింది. దీంతో వెంటనే స్పందించిన బులంద్ షెహర్ మున్సిపల్ అధికారులు.. మోదీ, యోగి ఫొటోలకు వేసిన పూల దండలను తొలగించారు.