Narendra Modi: ప్రధాని అలా నడవడం అపూర్వం... దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు: మోదీకి సీనియర్ అధికారుల కితాబు!

  • వాజ్ పేయి అంతిమయాత్రలో నడిచిన ప్రధాని
  • ఆరుకిలోమీటర్ల దూరం కాలినడకనే
  • ఆశ్చర్యపోయామంటున్న అధికారులు

తన మనసుకు నచ్చిన నేత, తనను నడిపించిన నాయకుడి అంతిమ యాత్రలో, ఆయనకు తుదిసారిగా వీడ్కోలు చెబుతూ, దాదాపు ఆరుకిలోమీటర్ల దూరాన్ని ప్రొటోకాల్ ను, భద్రతా అంశాలనూ పక్కనబెట్టి మరీ నడిచిన ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి సీనియర్ అధికారులు ఫిదా అయ్యారు. కళ్లల్లో పెల్లుబుకుతున్న నీటిని దిగమింగుకుంటూ, భాజపా ప్రధాన కార్యాలయ భవనం మొదలుకొని యమునా నది ఒడ్డున ఉన్న స్మృతిస్థల్‌ వరకు సాధారణ పౌరుడిలా వాజ్ పేయి భౌతికకాయాన్ని ఉంచిన వాహనం పక్కనే మోదీ నడవటాన్ని చూసి ఆయనకు నిత్యమూ భద్రత కల్పించే సిబ్బంది నివ్వెరపోయారు. ఉద్వేగభరింతంగా సాగిన ఆయన నడక పదవీ విరమణ చేసిన అధికారుల మనసులనూ కొల్లగొట్టింది.

ఇది అపూర్వ ఘటనని, ఇంతకుముందు దేశంలో ఎక్కడా, ఎన్నడూ ఇలా జరగలేదని, తన సర్వీసులో ఒక ప్రధాని ఇంత దూరం నడక సాగించడం ఇదే తొలిసారని ఆయన భద్రతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. యాత్ర పొడవునా పహారా కాశామని, మోదీ నడకను చూసి ఎంత ఆశ్చర్యపోయామో తమకే తెలుసునని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ అన్నారు.

 నరేంద్ర మోదీ వంటి ప్రధానమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి అమోద్ కాంత్ తెలిపారు. నేతలు, మంత్రులు కలసి నడుస్తుంటే, ప్రధాని వారి ముందు దారిచూపారని, ఇటువంటి ఘటన 1984లో ఇందిరాగాంధీ మరణించిన సమయంలో తనకు కనిపించిందని, నాడు భద్రతాధికారిగా విధుల్లో ఉన్న అమోద్ తెలిపారు. ఈ తరహా యాత్రను జవహర్ లాల్ నెహ్రూ మరణించిన వేళ వందల మంది చూసుంటారని అభిప్రాయపడ్డారు. ఇక మోదీ కొంతదూరం నడిచి, ఆపై కారులో వెళతారని తాము భావించామని, ఆయన ఆసాంతం నడిచారంటే, ఆశ్చర్యపోయామని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News