aadhaar: ఆధార్ లో ఇక ‘ఫేస్ రికగ్నిషన్’ ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి!
- సెప్టెంబర్ 15 నుంచి అమలు చేస్తామన్న యూఐడీఏఐ
- దేశమంతా దశలవారీగా తీసుకొస్తామని వెల్లడి
- సిమ్ కార్డుల జారీలో వాడాలని టీపీఎస్ లకు ఆదేశం
అధార్ కార్డు జారీచేసేందుకు అధికారులు ఇప్పటివరకూ వేలి ముద్రలు, ఐరిస్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వేలి ముద్రలను కొందరు దుండగులు క్లోనింగ్ చేసి అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పందించింది. బయోమెట్రిక్, ఐరిస్ లకు అదనంగా ముఖ కవళికలను గుర్తించేలా ఫేస్ రికగ్నిషన్ ను కూడా ఆధార్ వివరాల నమోదు సమయంలో సేకరిస్తామని ప్రకటించింది.
వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయాలని అధికారులు అనుకున్నారు. కానీ అన్ని ఏజెన్సీల వద్ద ఇందుకు తగిన పరికరాలు లేకపోవడంతో సెప్టెంబర్ 15కు వాయిదా పడింది. దేశంలో ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని దశలవారీగా అమలు చేయాలని యూఐడీఏఐ యోచిస్తోంది. టెలికాం సంస్థ(టీపీఎస్)లు సిమ్ కార్డులు జారీ సమయంలో ఆధార్ తో పాటు లైవ్ ఫేస్ ఫొటో తీసుకుని ఈ-కేవైసీలో పొందుపరచాలని ఆదేశించింది. టీపీఎస్ లు జరిగే లావాదేవీల్లో కనీసం 10 శాతం లైవ్ ఫేస్ ఫొటో విధానంలో నమోదు చేయాలని స్పష్టం చేసింది. టార్గెట్ చేరుకోకుంటే ఒక్కో వ్యవహారానికి 20 పైసలు వసూలు చేస్తామని హెచ్చరించింది.