India: గాండ్రించిన భారత్... మూడో టెస్టులో అరుదైన రికార్డులు!
- సెంచరీని మిస్ చేసుకున్న కోహ్లీ
- అరంగేట్రాన్ని సిక్సుతో మొదలు పెట్టిన రిషబ్ పంత్
- 2002 తరువాత ఇంగ్లండ్ పై 150 పరుగుల భాగస్వామ్యం
ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పేలవంగా ఆడి ఓటమిని చవిచూసిన భారత్, టెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో మాత్రం గాండ్రించింది. మూడు పరుగుల తేడాతో విరాట్ కోహ్లీ సెంచరీని మిస్ చేసుకున్నా, ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసి పటిష్ఠ స్థితికి చేరింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొన్ని అరుదైన రికార్డులను నమోదు చేశారు. తన టెస్టు కెరీర్ లో 90 పరుగులు దాటిన తరువాత కోహ్లీ సెంచరీ సాధించకుండా అవుట్ కావడం ఇది రెండోసారి. 2013లో వాండరర్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 96 పరుగులు చేసిన కోహ్లీ, ఆపై నిన్న 97 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ రెండు టెస్టు మ్యాచ్ ల మధ్యలో కోహ్లీ 17 సెంచరీలు సాధించడం గమనార్హం.
ఇక ఇదే సమయంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్, తన పరుగుల వేటను సిక్సర్ తో ప్రారంభించాడు. కోహ్లీ అవుట్ అయిన తరువాత వచ్చిన రిషబ్, సిక్స్ కొట్టి, ఈ ఫీట్ సాధించిన 12వ ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ, అజింక్య రహానేల జోడీ 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మరో రికార్డు. 2002 తరువాత ఇంగ్లండ్ గడ్డపై ఈ ఫీట్ నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో పాటు ఐదేళ్ల తరువాత టెస్టుల్లో తొలి వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం (ఆసియా, వెస్టిండీస్ మినహా) ఈ మ్యాచ్ లో నమోదైంది. టెంట్ బ్రిడ్జ్ మైదానంలో 90 పరుగులను దాటి సెంచరీ మిస్ అయిన గంగూలీ (99), సచిన్ (92, 91)ల సరసన కోహ్లీ చేరాడు. టెస్టుల్లో భారత్ పై 100 వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్ గా ఆండర్సన్ నిలిచాడు. గతంలో ఈ ఫీట్ ఒక్క మురళీధరన్ (105 వికెట్లు) మాత్రమే సాధించాడు.