srisailam project: కృష్ణమ్మ పరుగులు.. శ్రీశైలం జలాశయం ఆరు గేట్లు ఎత్తివేత!
- ఆరుగేట్లను పైకెత్తిన ఏపీ మంత్రి దేవినేని
- పది అడుగుల మేరకు గేట్ల ఎత్తివేత
- బాబు కష్టానికి దైవ సంకల్పం కలిసొచ్చిందన్న దేవినేని
ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు ఆరుగేట్లను ఏపీ మంత్రి దేవినేని ఉమ పైకెత్తారు. పది అడుగుల మేరకు గేట్లను పైకెత్తి స్పిల్ వే ద్వారా 1,56,636 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు కష్టానికి దైవ సంకల్పం కూడా కలిసి రావడం వల్లే కృష్ణమ్మ తల్లి వచ్చిందని అన్నారు. తమకు ఉన్న లెక్కల ప్రకారం, నాగార్జునసాగర్, పులిచింత ప్రాజెక్టులు కూడా నిండాలని అన్నారు.
కాగా, జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి 3,15,552 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 881.9 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 197.9120 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 72,257 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నట్టు అధికారుల సమాచారం.