Pawan Kalyan: ‘జనసేన’లో చేరిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ
- ‘జనసేన’ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
- పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముత్తాకు స్థానం
- పార్టీకి యువశక్తితో పాటు అనుభవజ్ఞులూ అవసరం
మాజీ మంత్రి కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్ జనసేన పార్టీలో చేరారు. వీరితో పాటు వాళ్ల అనుచరులు 500 మంది కూడా పార్టీలో చేరారు. హైదరాబాద్ మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ కార్పొరేటర్ మాకినీడు శేషుకుమారి తదితరులు ‘జనసేన’లో చేరారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పార్టీకి యువశక్తితో పాటు అనుభవజ్ఞులు చాలా అవసరమని, రాజకీయాల్లో పరిపూర్ణ అవగాహన ఉన్న ముత్తా గోపాలకృష్ణ లాంటి వారు ‘జనసేన’లోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన అనుభవం.. పార్టీకి, సమాజానికి మంచి చేయాలని పరితపించే జనసైనికులకు దిశానిర్దేశం చేస్తుందని, అందుకే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయనకు స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు. గోదావరి బేసిన్ లో ఉన్న గ్యాస్ నిక్షేపాలు రాష్ట్రానికి ఉపయోగపడకుండా తరలిపోతున్నాయని, వాటిని ప్రశ్నించే వారే లేరని, ముత్తా గోపాలకృష్ణ వంటి పెద్దలు ఆ రోజు విధాన నిర్ణయంలో ఉండి ఉంటే రాష్ట్రానికి ఎంతో కొంత వాటా తీసుకొచ్చేవారని అభిప్రాయపడ్డారు. పార్టీ పాలసీల్లో వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు.
అల్లూరి, భగత్ సింగ్ స్థాయికి పవన్ ఎదిగారు
అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ స్థాయికి పవన్ కల్యాణ్ ఎదిగారని ముత్తా గోపాల కృష్ణ అన్నారు. సమాజంలో మార్పు కోసం ఆయన కృషి చేస్తున్నారని, జనసేన పార్టీతో ఆ మార్పు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఆ పార్టీకి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.