Kerala: కేరళకు సాయం చేద్దాం..భారతీయ సోదరులను ఆదుకుందాం రండి: యూఏఈ వైస్ ప్రెసిడెంట్ పిలుపు
- మనమందరం కలిసి ఆ రాష్ట్రాన్ని ఆదుకుందాం
- యూఏఈలో ఉండే భారతీయులతో కలిసి సాయం
- మీరు చేయగలిగిన సాయం చేయండి: షేక్ మహమ్మద్ ట్వీట్
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించింది. రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే తమ విరాళాలు ప్రకటించారు. తాజాగా, కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు యూఏఈ కూడా సమాయత్తమవుతోంది. అంతేకాకుండా, అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న భారతీయులను కలుపుకొని కేరళ ప్రజలకు సాయమందించేందుకు యూఏఈ ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. ఈ సందర్భంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ ఓ పిలుపు నిచ్చారు. కేరళకు సాయం చేయాలని కోరుతూ ఓ ట్వీట్ చేశారు.
‘ప్రకృతి అందాలకు నెలవైన కేరళకు కష్టమొచ్చింది. మనమందరం కలిసి ఆ రాష్ట్రాన్ని ఆదుకుందాం. మనకు చేతనైన సాయం చేద్దాం. యూఏఈలో ఉండే భారతీయులతో కలిసి కేరళకు సాయం చేయబోతున్నామని, మీరు కూడా వచ్చి మాతో చేతులు కలపండి. అక్కడి వారందరికీ తక్షణ సాయం అందించడానికి మేం ఓ కమిటీగా ఏర్పడ్డాం. మాతో వచ్చి మీరు చేయగలిగిన సాయం చేయండి... భారతీయ సోదరులను ఆదుకుందాం రండి’ అని బిన్ రషీద్ పిలుపు నిచ్చారు.