periyar Dam: 'కేరళలో డ్యామ్ కూలిపోయింది' అంటూ సోషల్ వదంతులు!
- కేరళవాసులను భయ భ్రాంతులకు గురి చేస్తున్న వదంతులు
- పెరియార్ డ్యామ్ కుప్ప కూలిందని సోషల్ మీడియాలో ప్రచారం
- ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు
అసలే భారీవర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే కేరళ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసేలా ముళ్ళ పెరియార్ డ్యామ్ కుప్పకూలిందని వదంతులు వ్యాపించాయి. ఇప్పటికే కేరళ ప్రజలు నిరాశ్రయులై ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తుంటే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ లు పెట్టి అలజడి సృష్టిస్తున్నారు కొందరు నెటిజన్లు. దీంతో ప్రజలు మరింతగా భయపడిపోతున్నారు.
దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు ఈ వదంతులపై దర్యాప్తు ప్రారంభించి వర్షాలు, వరదలకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్ పోస్ట్‌లను పరిశీలించి డ్యామ్ కుప్పకూలిందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న నెటిజన్లపై కఠినచర్యలు తీసుకోనున్నారు సైబర్ పోలీసులు. కేరళ పోలీసులకు సహాయక చర్యలు ఒక ఎత్తయితే సోషల్‌మీడియాలో పుకార్లను అడ్డుకోవటం మరో పనిగా మారింది.