air india: అలవెన్సులు ఇవ్వలేదో.. విమానాలు నడపడం ఆపేస్తాం!: ఎయిర్ ఇండియాకు పైలెట్ల అల్టిమేటం
- రెండు నెలల అలవెన్సులు బాకీపడ్డ సంస్థ
- చెల్లించకపోవడంపై పైలెట్ల ఆగ్రహం
- ఆఫీస్ కు వచ్చి కూర్చుని వెళ్లిపోతామని స్పష్టీకరణ
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు పైలెట్లు షాక్ ఇచ్చారు. తమకు బాకీపడ్డ అలవెన్సులను వెంటనే చెల్లించకపోతే విమానాలను నడపడం ఆపేస్తామని హెచ్చరించారు. జూలై వేతనాలను ఆలస్యంగా ఆగస్టులో చెల్లించడంపై మండిపడ్డారు.
సాధారణంగా పైలెట్లకు అందే ప్యాకేజీలో వేతనం కేవలం 30 శాతమే ఉంటుంది. మిగతావన్నీ అలవెన్సుల రూపంలోనే ఉంటాయని ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ తెలిపింది. ఎయిర్ఇండియా సంస్థ పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది తప్ప మిగతా అందరికీ అలవెన్సులు చెల్లిస్తోందని ఆరోపించింది. జూన్ నెలలో చెల్లించాల్సిన అలవెన్సులను కూడా ఇప్పటివరకూ ఎయిర్ఇండియా ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేవలం జీతం మాత్రమే ఇస్తున్నందున ఆఫీస్ కు వచ్చి కూర్చుంటామనీ, ఫ్లయింగ్ అలవెన్సులు ఇవ్వకుంటే విమానాలను నడపబోమని పైలెట్లు తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు ఎయిర్ఇండియాకు నోటీసులు జారీచేశారు.