Amaravathi: స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ కానున్న సీఆర్డీయే.. మరోమారు అమరావతి బాండ్ల జారీ
- ఈ నెల 27న మరోమారు బాండ్ల జారీ
- బీఎస్ఈలో లిస్ట్ కానున్న సీఆర్డీయే
- బాండ్ల జారీపై ప్రతిపక్షాల విమర్శలు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోమారు బాండ్ల జారీకి సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ద్వారా షేర్లను విక్రయించనున్నారు. సీఆర్డీయే బీఎస్ఈలో లిస్ట్ కాబోతోంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ప్రారంభించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం బాండ్లు జారీ చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కాగా, అంచనాలకు మించి స్పందన రావడం విశేషం.
గంట వ్యవధిలోనే రూ.2 వేల కోట్ల విలువైన అమరావతి బాండ్లు అమ్ముడుపోయాయి. ప్రభుత్వంపై ఉన్న విశ్వాసంతోనే బాండ్లు కొనేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు. మరోవైపు, అమరావతి బాండ్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బాండ్లు జారీ చేయడమంటే అధిక వడ్డీకి అప్పు తీసుకోవడమేనని చెబుతున్నారు. విమర్శలు ఎలా ఉన్నా మరోమారు బాండ్ల జారీకి సీఆర్డీయే అధికారులు సిద్ధమవుతున్నారు.