Kerala: కేరళను వరుణుడు ఎందుకు వణికిస్తున్నాడు? నిపుణులు చెబుతున్న కారణం ఇదే!

  • వర్షాలు, వరదలకు 97 మంది బలి
  • పర్యావరణ విధ్వంసమే కారణమంటున్న నిపుణులు
  • తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన

భారీ వర్షాలు, వరదలతో కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత భారీ వర్షాలు ముంచెత్తడంతో ఇప్పటివరకూ 97 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విపత్తుకు మానవ తప్పిదాలే కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పర్యావరణ విధ్వంసం కారణంగానే భారీ వరదలు జనావాసాలపైకి పోటెత్తుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.


పశ్చిమ కనుమల విధ్వంసంతో కేరళకు తొలి దెబ్బ పడిందన్నది నిపుణులు చెబుతున్నమాట. కేరళలో భారీ వర్షాలకు కారణమయ్యే ఈ ప్రాంతంలో గతంలో దట్టంగా అడవులు ఉండేవి. కానీ గత ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న కొండలపై టూరిస్టులను ఆకర్షించడం కోసం చెట్లను నరికేసి కాంక్రీటు చేపట్టాయి. దీంతో నీటి ప్రవాహాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం ఈ ప్రాంతంలో తగ్గిపోయింది.


కొండలపై కాంక్రీటు నిర్మాణాలు చేపట్టడంతో ఆ బరువును అక్కడి నేల తట్టుకోలేకపోయింది. వర్షానికి తడవగానే చాలా చోట్ల కుంగిపోయింది. దీంతో కొండచరియలు విరిగిపడి ఇడుక్కి, యర్నాకుళం సహా పలు జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీనికి తోడు విచ్చలవిడిగా నదుల్లో ఇసుకను తవ్వేయడం, వాతావరణ కాలుష్యం కలసి కేరళను ప్రస్తుత విపత్కర పరిస్థితిలోకి నెట్టాయని నిపుణులు చెబుతున్నారు.


1924వ సంవత్సరంలో కేరళలో ఏకంగా 3,348 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు 2,000 మిల్లీమీటర్ల కుంభవృష్టితో కేరళ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికీ మించిపోయింది లేదనీ, పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్ లో కలిగే విధ్వంసం ఊహకు కూడా అందదని హెచ్చరిస్తున్నారు.

Kerala
flood
heavy rain
mansoon
  • Loading...

More Telugu News