AB Vajpayee: వాజ్‌పేయి హయాంలో జరిగిన 8 కీలక ఘట్టాలు ఇవే!

  • ఫోఖ్రాన్ అణు పరీక్షలతో భారత్‌పై ఆంక్షలు
  • మోదీని వెనకేసుకొచ్చినందుకు విమర్శలు
  • విమానం హైజాక్‌తో ఉగ్రవాదులను విడిచిపెట్టిన వాజ్‌పేయి ప్రభుత్వం

భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన వాజ్‌పేయి చివరి రోజుల్లో జ్ఞాపకశక్తి కోల్పోయారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రసంగాలతో  జనాలను మెస్మరైజ్ చేసే ఆయన మూడుసార్లు దేశానికి ప్రధానిగా పనిచేశారు. ఆయన రాజకీయ కెరీర్‌లో తీసుకున్న 8 నిర్ణయాత్మక ఘటనలు..

ఫోఖ్రాన్ 2 (1998)
నిశ్శబ్దంగా అణు పరీక్షలు నిర్వహించి మొత్తం ప్రపంచ దృష్టిని భారత్ వైపు మళ్లించారు. భారత్ అణుపరీక్షలతో ఉడికిపోయిన అమెరికా ఆంక్షలు విధించింది. భారత్ అణ్వస్త్ర శక్తిగా ఎదిగినప్పటికీ ఏ దేశంపైనా తొలుత దాడిచేయబోదని వాజ్‌పేయి ప్రకటించారు. భారత్ తనకు తానుగా మారటోరియం విధించుకున్నట్టు అప్పటి విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ ప్రకటించారు.

లాహోర్ పర్యటన (ఫిబ్రవరి, 1999)
భారత్-పాకిస్థాన్ మధ్య తొలిసారి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి బస్సులో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రయాణించారు. లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్థాన్‌ను సందర్శించారు. అక్కడి విజిటర్స్ బుక్‌లో పాకిస్థాన్ సార్వభౌమాధికారంతో సుసంపన్నమైన దేశంగా ఎదగాలని రాశారు. పాక్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించిన తొలి భారత ప్రధాని ఆయనే.

ఆపరేషన్ విజయ్ (జూన్-జూలై 1999)
కార్గిల్‌లోకి చొచ్చుకొచ్చిన పాక్ దళాలు సైన్యంపై దాడులకు తెగబడ్డాయి. ప్రతిగా భారత సైన్యం దీటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. కార్గిల్ చొరబాటును తీవ్రంగా పరిగణించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సమన్లు పంపారు. కార్గిల్ నుంచి తమ దళాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో దిగివచ్చిన పాక్ దళాలను వెనక్కి తీసుకుంది.

విమానం హైజాక్ (డిసెంబరు 1999)
వాజ్‌పేయి హయాంలో ఎయిరిండియా విమానాన్ని పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఫలితంగా భారత జైళ్లలో ఉన్న మౌలానా మసూద్ అజర్‌, ముస్తాక్ అహ్మద్ జర్గార్, ఒమర్ సయీద్‌లను వాజ్‌పేయి ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ప్రయాణికులతో ఖాట్మండు వెళ్తున్న విమానాన్ని కాందహార్ తరలించిన ఉగ్రవాదులు తమ సహచరులను విడిపించుకున్నారు.  

ఆగ్రా సమ్మిట్ (జూలై 2001)
అణ్వస్త్ర పరీక్షలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దానిని చల్లార్చేందుకు వాజ్‌పేయి-ముషారఫ్ ఆగ్రాలో రెండు రోజులపాటు భేటీ అయ్యారు. కశ్మీర్ వివాదం, సీమాంతర ఉగ్రవాదంపై చర్చించాల్సి ఉండగా, ఒక్క కశ్మీర్‌పైనే చర్చిస్తామంటూ ముషారఫ్ పట్టుబట్టారు. దీనికి భారత్ నిరాకరించింది. దీంతో ఈ చర్చలు అసంపూర్తిగా మిగిలాయి.

గుజరాత్ అల్లర్లు (డిసెంబరు 2002)
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్లు చెలరేగాయి. మోదీని తొలగించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నప్పటికీ వాజ్‌పేయి మాత్రం మోదీకి మద్దతుగా నిలిచారు. మోదీ రాజధర్మాన్ని పాటించారంటూ ఆయనకు అండగా నిలిచారు. దీంతో వాజ్‌పేయిపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

పార్లమెంటుపై దాడి (డిసెంబరు 2001)
లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు సహా 12 మంది మృతి చెందారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వాజ్‌పేయి 5 లక్షల బలగాలను సరిహద్దులో మోహరించారు. యుద్ధవిమానాలు, నౌకలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. రెండు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యుద్ధం తప్పదని అందరూ భావించారు. ఆరు నెలలపాటు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా జోక్యంతో వాతావరణం చల్లబడింది.

ముషారఫ్‌తో (2004)
ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ సమావేశాల సందర్భంగా వాజ్‌పేయి-ముషారఫ్ భేటీ అయ్యారు. తమ గడ్డపై నుంచి భారత్‌పైకి ఉగ్రవాదులను అనుమతించబోనని ఈ సందర్భంగా ముషారఫ్ హామీ ఇచ్చారు. ఈ చర్చలు కూడా మిశ్రమంగా ముగిశాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News