Vajpayee: వాజ్ పేయి భగ్న ప్రేమికుడా? చనిపోయేవరకూ ఆయనతోనే ఉన్న రాజ్ కుమారి ఎవరు?
- కాలేజీలో పరిచయమైన రాజ్ కుమారి
- జీవితాంతం కొనసాగిన స్నేహం
- పెళ్లికి అడ్డుపడ్డ ఆరెస్సెస్ సీనియర్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చనిపోయేవరకూ అవివాహితుడిగానే ఉండిపోయారు. అయితే, వాజ్ పేయికి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరిన వాజ్ పేయి కాలేజీ రోజుల్లో రాజ్ కుమారి అనే అమ్మాయితో కలసి చదువుకున్నారు. అప్పటినుంచి వీరి స్నేహం కొనసాగింది. రాజ్ కుమారికి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బీఎన్ కౌల్ తో వివాహమైంది. పెళ్లయిన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది.
కొన్నేళ్ల తర్వాత దురదృష్టవశాత్తూ కౌల్ ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో రాజ్ కుమారితో పాటు ఆమె కుమార్తె నమితను తన దగ్గరకు రావాల్సిందిగా వాజ్ పేయి ఆహ్వానించారు. నమితను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి 2014లో చనిపోయే వరకూ రాజ్ కుమారి వాజ్ పేయితోనే ఉన్నారు.
కౌల్ బతికుండగానే వాజ్ పేయిని పెళ్లాడేందుకు వీలుగా రాజ్ కుమారి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతారు. అయితే ఓ వివాహితను పెళ్లి చేసుకుంటే జన్ సంఘ్ పార్టీలో కెరీర్ దెబ్బతింటుందని ఆరెస్సెస్ సీనియర్ ఒకరు హెచ్చరించడంతో వాజ్ పేయి వెనక్కి తగ్గారని, జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయారన్నది ఆయన సన్నిహితులు చెప్పేమాట.