Krishna: మరో ఎనిమిదడుగులే... 877 అడుగులకు శ్రీశైలం నీటి నిల్వ!
- పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది
- 3.11 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద
- సాగర్ కు లక్ష క్యూసెక్కుల నీటి విడుదల
ఉరకలేస్తున్న గోదావరితో సమానంగా కాకపోయినా, కృష్ణానది సైతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలకు వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు వదులుతుండగా, గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలోనే శ్రీశైలం నిండుకుండలా మారింది.
జలాశయానికి 3.11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 877 అడుగులకు నీరు చేరుకుంది. వరద మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులను, హంద్రినీవా ప్రాజెక్ట్ కు 2,025 క్యూసెక్కులను, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.