Vajpayee: ఒక్క ఓటుతో ఓడిపోతున్నానని తెలిసీ, అవినీతికి పాల్పడే ప్రయత్నం చేయని వాజ్ పేయి!
- విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వాజ్ పేయి
- ఓటమిని కూడా హుందాగా స్వీకరించే రాజనీతిజ్ఞడు
- ఎంపీలను ప్రలోభ పెట్టేందుకు అంగీకరించని వాజ్ పేయి
దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి, విలువలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారన్న విషయానికి ఈ ఒక్క ఘటనే ఉదాహరణ. 1996లో భిన్నమైన పార్టీలను, శక్తులను ఏకం చేసి ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఆయన, ఆపై తనకు మద్దతు లేదని తెలుసుకుని 13 రోజుల తరువాత ఓటమిని హుందాగా అంగీకరించి పదవిని వీడారు. ఆ సమయంలో మేజిక్ ఫిగర్ కు వాజ్ పేయి సర్కారు కేవలం ఒకే ఒక్క ఓటు దూరంలో ఉంది. విశ్వాస పరీక్షలో విజయం సాధించేందుకు ఏ ఇతర ఎంపీనీ ప్రలోభాలకు గురిచేయని రాజకీయ నీతిజ్ఞుడాయన.
1998లో మరోసారి తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా, హుందాగానే ఉన్నారు తప్ప, ఫిరాయింపులను ప్రోత్సహించే పని చేసేందుకు ఏమాత్రం ఒప్పుకోని మేరునగధీరుడు వాజ్ పేయి. 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 13 నెలల తరువాత, విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన వేళ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హ్యాండిస్తే, అప్పుడు కూడా హుందాగా పదవి నుంచి హుందాగానే దిగిపోయారు. వాజ్ పేయికి మద్దతు ఉపసంహరించుకుని తాను తప్పు చేశానని జయలలిత సైతం తరువాతి కాలంలో అంగీకరించడం గమనార్హం. ఆ సమయంలో ఆయన ఇతర పార్టీల ఎంపీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసుంటే, తన ప్రభుత్వాన్ని కాపాడుకుని ఉండేవారు. పదవిని తృణప్రాయంగా వదిలి, పలువురికి ఆదర్శప్రాయుడిగా నిలిచారు వాజ్ పేయి.