AB Vajpayee: వాజ్‌పేయి వ్యాఖ్యలతో నిర్ఘాంతపోయిన నేతలు!
- అద్వానీని ప్రధానిగా చేయాలని ఓ వర్గం ప్రయత్నాలు
- వాజ్‌పేయి వెనుక మంత్రాంగం
- వాజ్‌పేయి ప్రసంగంతో నేతల షాక్
ఏబీ వాజ్‌పేయి ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలతో పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేతలు నిర్ఘాంతపోయారు. 2004లో ఎన్నికల్లో ఎన్డీయే గెలిచి అధికారంలోకి వస్తుందని, అదే జరిగితే ఎల్‌కే అద్వానీని ప్రధానిని చేయాలని పార్టీలోని ఓ వర్గం భావించి అందుకు పావులు కదపడం మొదలు పెట్టింది. వాజ్‌పేయిని వికాస్ పురుష్‌గా, అద్వానీని లోహ్ పురుష్‌గా అభివర్ణిస్తూ వాజ్‌పేయి త్వరలోనే రిటైర్ అవుతారని, అద్వానీ పాలనా పగ్గాలు చేపడతారని ఓ వర్గం నేతలు ప్రచారం మొదలుపెట్టారు. తనకు తెలియకుండా తెర వెనక నుంచి జరుపుతున్న మంత్రాంగం వాజ్‌పేయి దృష్టికి రావడంతో ఆయన నొచ్చుకున్నారు.
తనకు చెప్పకుండా తన వెనక పావులు కదపడం ఆయనకు నచ్చలేదు. అప్పటికే ఆరేళ్లు ప్రధానిగా పనిచేసిన ఆయన 2004 ఎన్నికల్లో ఎన్డీయే గెలవడం అసాధ్యమని భావించారు. అయితే, తన వెనక జరుగుతున్న పరిణామాలను మాత్రం ఆయన సీరియస్‌గానే తీసుకున్నారు. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘న టైర్డ్.. న రిటైర్డ్. అద్వానీజీకి నేతృత్వ్ మే విజయ్ కీ ఓర్ ప్రస్థాన్ (అలసిపోలేదు, రిటైర్ కాలేదు. అద్వానీ నాయకత్వంలో విజయం వైపు పయనం) అని వ్యాఖ్యానించడంతో పార్టీ శ్రేణులు నిర్ఘాంతపోయాయి. అద్వానీని ప్రధానిని చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఆయనకెలా తెలిశాయో తెలియక నేతలు ఆశ్చర్యపోయారు.