London: లండన్ నుండి తిరిగొచ్చిన బుద్ధుడి విగ్రహం
- నలంద నుంచి అపహరణకు గురైన 12 వ శతాబ్దం నాటి బుద్ధుడి విగ్రహం
- లండన్ లో విగ్రహాల వేలంలో కనిపించిన విగ్రహం
- ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్ట్ ప్రతినిధి చొరవతో భారత్ కు
12 వ శతాబ్దం నాటి అతి పురాతన గౌతమ బుద్ధుడి విగ్రహం అది.. బీహార్ లోని నలందలో ఉన్న ఈ విగ్రహం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రదర్శనశాల నుంచి అపహరణకు గురయ్యింది. 1961లో అపహరణ కు గురైన ఈ విగ్రహం అనూహ్యంగా అరవై ఏళ్ళ తర్వాత భారత దేశానికి చేరింది.
లండన్ లో నిర్వహిస్తున్న విగ్రహాల వేలంలో పాల్గొన్న ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్టు ప్రతినిధి అక్కడ వేలంలో నలందలో అపహరణకు గురైన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని చూసి పోలీసులకు ఈ విషయాన్ని వివరించారు. అలాగే భారత హై కమీషన్ కు తెలియజేశారు. 1961లో బీహారులోని నలందలో ఉన్న 14 విగ్రహాలు అపహరణకు గురయ్యాయి. చివరకు అవి లండన్ చేరాయి. ఇప్పుడు ఆ విగ్రహాల్లో నుంచి గౌతమబుద్ధుడి విగ్రహాన్ని భారత్‌కు అందచేశారు లండన్ అధికారులు.
12వ శతాబ్దం నాటి అద్భుత శిల్పకళాచాతుర్యంతో ప్రసన్న వదనంతో వున్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు భారత హై కమిషనరుకు తిరిగి అందచేశారు. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ విగ్రహాన్ని అందచేసినట్లు లండన్ పోలీసులు వెల్లడించారు.