Srikakulam District: శ్రీకాకుళం పోలీసుల ఓవరాక్షన్.. తండ్రిని కొడుతుంటే వేడుకున్న బిడ్డలు!
- ఆర్ట్స్ కళాశాలలో జెండా పండగ
- ఓ దారిని మూసేసిన పోలీసులు
- ఆ దారిలో ఫుట్ పాత్ పై ఉన్నందుకు జులుం
- తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు
స్వాతంత్ర్య దినోత్సవం నాడు సరదాగా బయటకు వెళ్లి, జెండా వందనం వేడుకలను తిలకించాలని భావించిన ఆ తండ్రీ, బిడ్డలకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజీలో వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, అక్కడికి వచ్చే ఓ మార్గాన్ని వీఐపీల కోసం పోలీసులు మూసివేశారు. అయినా అటునుంచి వస్తున్న ప్రజలను అదుపు చేసే క్రమంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఈ సమయంలో తన ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఓ వ్యక్తి, ఎటూ వెళ్లే దారిలేక ఫుట్ పాత్ పై నిలబడ్డారు. అతన్ని చూసిన పోలీసులు ఆగ్రహంతో చుట్టుముట్టి ఇక్కడెందుకున్నావంటూ చితకబాదుతుంటే, ఆ బిడ్డలు వలవలా ఏడ్చారు. "మా నాన్నను కొట్టకండి" అంటూ వేడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వారు సైతం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరకు తన పిల్లలను ఓదార్చి, వారి ఏడుపు ఆపించిన తండ్రి, వారిని తీసుకుని ఇంటిదారి పట్టాడు.