Tirumala: నిన్నటి వరకూ కలశంలో ఉన్న వెంకన్న స్వామి అంశ... నేడు తిరిగి మూలవిరాట్టులోకి!
- మొదలైన కీలక క్రతువు
- ఆపై మహా సంప్రోక్షణం
- 12 కల్లా ముగియనున్న అష్టబంధన బాలాలయ మహసంప్రోక్షణం
గత నాలుగు రోజులుగా పూర్ణకుంభంలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అంశ నేడు తిరిగి స్వామివారిలోకి ప్రవేశించనుంది. 11వ తేదీ నుంచి ప్రారంభమైన మహా సంప్రోక్షణంలో భాగంగా, బాలాలయం, అష్టబంధన కార్యక్రమాలు విజయవంతంగా ముగియగా, మహా సంప్రోక్షణకు ముందు, కళాకర్షణ పద్ధతిలో స్వామి అంశను కలశంలోకి ప్రవేశపెట్టిన అర్చకులు, తిరిగి ఆ అంశను మూలవిరాట్టులోకి పంపే క్రతువును ప్రారంభించారు.
ఆగమ శాస్త్రానుసారం జరుగుతున్న ఈ క్రతువు మరికాసేపట్లో పూర్తి కానుంది. ఆపై అన్ని ఉపాలయాల్లోని దేవతామూర్తులు, విమాన వెంకటేశ్వరుడి అంశలను తిరిగి విగ్రహాల్లోకి పంపే కార్యక్రమాలు జరగనున్నాయి. ఆపై 12 గంటల వరకూ జరిగే మహా సంప్రోక్షణతో మొత్తం కార్యక్రమం పూర్తవుతుంది. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆరు రోజుల పాటు తిరుమల ఆలయంలో పుష్కరానికి ఓ మారు అష్టబంధన మహాసంప్రోక్షణం చేపడతారన్న సంగతి తెలిసిందే.