jefferey boycott: టీమిండియా అహంకారంతో వచ్చింది.. కోహ్లీ సేన విమర్శలు ఎదుర్కోవడంలో తప్పు లేదు: బాయ్ కాట్
- చెత్త ప్రదర్శన చేసినందుకు కోహ్లీ సేనను విమర్శించడంలో తప్పులేదు
- కోహ్లీ సేన కఠోర శ్రమ చేయడం లేదు
- భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోంది
తమ దేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో చెత్త ప్రదర్శన చేస్తున్న టీమిండియాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ విమర్శలు గుప్పించారు. ఇంగ్లండ్ కు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాటు, అహంకారంతో టీమిండియా వచ్చిందని అన్నారు. భారత గడ్డపై ఆడినట్టు ఇక్కడ కూడా ఆడితే సరిపోతుందని టీమిండియా భావించిందని... ఇండియా ఘోర వైఫల్యానికి అదే కారణమని అన్నారు. చెత్త ప్రదర్శన చేసినందుకు కోహ్లీ సేన విమర్శలను ఎదుర్కోవడంలో తప్పు లేదని చెప్పారు.
ఔట్ స్వింగ్ అవుతున్న బంతులను వెంటాడిన భారత బ్యాట్స్ మెన్ తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారని బాయ్ కాట్ అన్నారు. బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్లే టీమిండియాకు వరుస ఓటములు ఎదురయ్యాయని చెప్పారు. కఠినమైన శ్రమతో మంచి ఫలితాలను రాబట్టవచ్చని... కానీ, కోహ్లీ టీమ్ ఆ పని చేయడం లేదని విమర్శించారు. టీమిండియా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందని చెప్పారు. డైలీ టెలిగ్రాఫ్ కు రాసిన కాలమ్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.