amarnath reddy: ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకి ఎకరాకు రూ.10 లక్షల రాయితీ అందిస్తాం: ఏపీ మంత్రి అమరనాథ రెడ్డి
- 3 లక్షల 35 వేల మందికి ఉపాధి కల్పించాం
- ప్రైవేటు భాగస్వామ్యంతో ఎంఎస్ఎఈ పార్కుల అభివృద్ధి
- మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.240 కోట్ల కేటాయింపు
ఎంఎస్ఎంఈల ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉండడంతో ఆ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి తెలిపారు. ఈ రంగంలో గడిచిన నాలుగేన్నరేళ్లలో రాష్ట్రంలో 13 వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడితో 23 వేల ఎంఎస్ఎంఈలు ఏర్పాటు అయినట్లు ఆయన వెల్లడించారు. వీటి ద్వారా 3 లక్షల 35 వేల మందికి ఉపాధి దక్కినట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే 36 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ఫైల్ పై ఇప్పటికే సంతకం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పార్కులలో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు రూ.240 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గతేడాది రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, దానికి సంబంధించిన విధివిధానాలన్నింటినీ రూపొందించామని తెలిపారు.
ఇక ప్రైవేటు భాగస్వామం ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి తెలిపారు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఎంఎస్ఎంఈ పార్కులను అన్ని మౌలిక వసతులతో అభివృద్ది చేయాలనుకుంటే వారికి ప్రభుత్వం తరపున ఎకరాకు రూ.10 లక్షల రాయితీలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల్లో పారిశ్రామికవేత్తలు రాయితీలు పొందేందుకు ఆఫీసుల చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం అలాంటి సమస్య లేదని మంత్రి అన్నారు. పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ లోనే రాయితీలన్నీ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్ ఎపికే రెడ్డి, నూడా చైర్మన్ కె శ్రీనివాసులు రెడ్డి, ఇండియన్ బ్యాంక్ అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.