jio gigafiber: మీ మాటతోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు.. జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..?
- ఇండిపెండెన్స్ డే సందర్భంగా గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన జియో
- 1జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్
- టీవీల కోసం గిగాటీవీ సెట్ టాప్ బాక్సులు
ఇప్పటికే టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చిన జియో... ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరో సంచలనానికి నాంది పలికింది. గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లను ఈ రోజు ప్రారంభించింది. ఈ సేవలతో వినియోగదారులకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ ను జియో అందించనుంది. గత నెలలోనే గిగాఫైబర్ ను ప్రకటించిన జియో... ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. గిగా ఫైబర్ ద్వారా వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఏ ప్రాంతంలో నమోదవుతాయో... తొలి విడతలో ఆయా ప్రాంతాల్లో గిగాఫైబర్ సర్వీసులను జియో ప్రారంభించనుంది. 1100 నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు గత నెలలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.
జియో గిగాఫైబర్ బ్రాడ్ బాండ్ ను ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే...
జియో అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
గిగాఫైబర్ పేజ్ లోకి ఎంటర్ అవ్వండి.
' Change ' బటన్ ప్రెస్ చేసి... మీ అడ్రస్ ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత ' Submit ' బటన్ నొక్కండి.
ఆ తర్వాత అది మీ ఇంటి అడ్రస్సా లేక ఆఫీస్ అడ్రస్సా అనేది సెలెక్ట్ చేయండి.
తర్వాతి పేజ్ లో మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఓటీపీ కోసం ' Generate OTP ' బటన్ నొక్కండి.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత... మీ లొకాలిటీ టైప్ (సొసైటీ, టౌన్ షిప్, డెవలపర్, తదితర)ను సెలెక్ట్ చేసి, 'Submit ' బటన్ ప్రెస్ చేయండి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ సందర్భంగా మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. జియో ఫైబర్ నెట్ వర్క్ కోసం మీ ఇంట్లో కాని, కార్యాలయంలో కానీ జియో గిగారౌటర్ ను ఇన్స్టాల్ చేస్తారు.
టీవీల కోసం గిగాటీవీ సెట్ టాప్ బాక్సులను జియో అమర్చుతుంది. మన వాయిస్ ద్వారా ఆపరేట్ అయ్యే రిమోట్ సిస్టం అందుబాటులో ఉంటుంది. మనం ఏది చూడాలనుకుంటున్నామో దాన్ని కొంచెం గట్టిగా పలికితే... స్క్రీన్ పై అది ఆటోమేటిక్ గా ప్రత్యక్షం అవుతుంది. అయితే, మన దేశంలో ఉన్న కొన్ని భాషలకే ఈ సౌకర్యం ఉంటుంది. వినియోగదారులు 600లకు పైగా ఛానళ్లను, వేలాది సినిమాలను, లక్షలాది పాటలను వీక్షించే అవకాశం ఉంటుంది.