ARUN GAWLI: మహారాష్ట్రలో మరో ‘శంకర్ దాదా’.. పరీక్షలో టాపర్ గా నిలిచిన అరుణ్ గావ్లీ!
- మారిపోయిన డాన్ అరుణ్ గావ్లీ
- గాంధీ బోధనలపై నిర్వహించిన పరీక్షలో టాపర్
- అభినందించిన జైలు అధికారులు
నచ్చిన ల్యాండ్ ను కబ్జా చేయడం, అడ్డొచ్చిన వారిని చావబాదడం, ప్రత్యర్థులను తుపాకీతో కాల్చిచంపడం.. మాఫియా డాన్ అంటే ఇలానే ఉంటాడని ఊహించుకుంటాం. కొంచెం కూడా కనికరం లేకుండా కర్కశంగా ఉంటాడని అనుకుంటాం. మాఫియా డాన్ అరుణ్ గావ్లీ కూడా అంతే. ఓ విషయంలో తనకు అడ్డువచ్చినందుకు శివసేన పార్టీ కార్పొరేటర్ ను హత్యచేశాడు. కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. దీంతో అతడిని అధికారులు నాగ్ పూర్ జైలుకు తరలించారు.
జైలుకెళ్లేవరకూ రక్తపిపాసిగా ఉన్న అరుణ్ ఆ తర్వాత మారిపోయాడు. సర్వోదయ ఆశ్రయం, సహయోగ్ ట్రస్ట్ సంయుక్తంగా గాంధీజీ జీవితంతో పాటు ఆయన బోధనలు వినిపించి ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు యత్నించాయి. బాపూ మాటలు అరుణ్ పై ఎంతగా ప్రభావం చూపాయంటే.. అతను గాంధీజీ బోధనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేంతగా! చివరికి గాంధీజీ ఆలోచనలపై నిర్వహించిన పరీక్షలో 90 మార్కులకు గానూ 74 మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. దాదాపు 159 మంది ఖైదీలు ఈ పరీక్ష రాయగా, అరుణ్ తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు బాపూ స్ఫూర్తితో గాంధీ టోపీని ధరించడం మొదలుపెట్టాడు. టాపర్ గా నిలిచిన అరుణ్ ను జైలు అధికారులు అభినందించారు.