Japan: జపనీస్ భాష వస్తే బుల్లెట్ ట్రైన్ స్టీరింగ్ మీకే.. భారత యువతకు బంపరాఫర్!
- వివరాలు ప్రకటించిన హైస్పీడ్ రైల్ కార్పొరేషన్
- సాధారణ డిగ్రీ ఉంటే చాలని వెల్లడి
- జపాన్ లో రెండేళ్ల పాటు ట్రైనింగ్
ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య జపాన్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టనున్న సంగతి తెలిసిందే. గంటకు సగటున 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు మార్గం మరో నాలుగేళ్లలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బుల్లెట్ రైళ్లను నడిపే డ్రైవర్ల కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్(ఎన్ హెచ్ఆర్ సీ) మార్గదర్శకాలు జారీచేసింది.
కేవలం బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్ కాదు)తో పాటు జపనీస్ భాష తెలిసినవాళ్లను ఇందుకోసం నియమించుకుంటామని తెలిపింది. స్టేషన్ మాస్టర్లతో సహా 56 మంది డ్రైవర్లను ఈ ప్రాజెక్టులో భాగంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది. వీరి శిక్షణ జపాన్ లో జరుగుతుందనీ, అక్కడి వారికి ఇంగ్లిష్ సరిగ్గా రాకపోవడంతో అభ్యర్థులకు జపనీస్ భాషను తప్పనిసరి చేసినట్లు ఎన్ హెచ్ఆర్ సీ పేర్కొంది. అక్కడే వీరికి రెండేళ్ల వరకూ శిక్షణ ఇస్తామని తెలిపింది.
వేగంగా వెళ్లే ఈ రైలును నడిపే అభ్యర్థులను సైకో మెట్రీ పరీక్ష నిర్వహించాకే ట్రైనింగ్ కు ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఈ పరీక్షలో భాగంగా అభ్యర్థుల మానసిక దృఢత్వం, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలను పరీక్షిస్తామని చెప్పింది.
జపాన్ సంస్థ షింకన్ సేన్ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. 2022 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ ద్వారా ముంబై-అహ్మదాబాద్ మధ్య ఉన్న 508 కి.మీ దూరాన్ని రెండు గంటల్లో చేరుకోవచ్చు. టికెట్ ధర దూరాన్ని బట్టి రూ.250 నుంచి రూ.3,000 వరకూ ఉండొచ్చు.