kcr: నాక్కూడా ప్రధానమంత్రి కావాలని ఉంది.. సాధ్యమేనా?: కేసీఆర్
- ప్రతి పార్టీకి, ప్రతి నేతకూ కలలు ఉంటాయి.. అన్నీ సాకారం కావు
- దేశ ముఖచిత్రాన్ని మార్చడానికే ఫెడరల్ ఫ్రంట్
- వెంటనే మార్పు రాకపోవచ్చు.. కానీ, వచ్చి తీరుతుంది
నిన్న సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు రాజకీయ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన సమాధానాలు ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేస్తామని బీజేపీ నేతలు అంటున్న విషయాన్ని రిపోర్టర్లు ప్రస్తావించగా... తనకు కూడా రెండు రోజుల్లో భారత ప్రధాని కావాలనే కోరిక ఉందని... అది సాధ్యం కాదుకదా? అంటూ సమాధానమిచ్చారు. ప్రతి పార్టీకి, ప్రతి నేతకూ కలలు ఉంటాయని... అవన్నీ సాకారం కావడం అసాధ్యమని చెప్పారు. అంతిమ నిర్ణేతలు ప్రజలే అని అన్నారు.
ఈ దేశంలో రెండు రాజకీయ వ్యవస్థలైన కాంగ్రెస్, బీజేపీలు దారుణంగా విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలోనే తాను ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ బలమైన శక్తిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే వ్యవస్థగా ఉంటుందని అన్నారు.
ఇంటర్నేషనల్ గూడ్స్ రైలు స్పీడ్ 90 కిలోమీటర్లయితే, మన గూడ్స్ రైలు స్పీడు 29 కిలోమీటర్లు మాత్రమేనని... ఇలాగైతే మన దేశం ఎప్పుడు బాగుపడుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. మన పక్కనున్న చైనాలో 2 లక్షల కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ హైవేలు ఉన్నాయని, మన దగ్గర కేవలం 2వేల కిలోమీటర్ల మేర మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 70వేల టీఎంసీల నీరు ఇండియాలో అందుబాటులో ఉందని, దీనిలో సగం నీటిని కూడా ఉపయోగించుకోలేకపోతున్నామని చెప్పారు.
ఇలాంటి వ్యవస్థను మార్చడానికే ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉందని అన్నారు. దేశ ముఖచిత్రాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. 130 కోట్ల జనాభాతో ఈ రెండు జాతీయ పార్టీలు పరాచికాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఎంతో భిన్నత్వం ఉన్న మన దేశంలో వెనువెంటనే మార్పును తీసుకురావడం కష్టమైనప్పటికీ, కచ్చితంగా ఫలితాన్ని సాధిస్తామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా మార్పుకు శ్రీకారం చుడతామని తెలిపారు.