Imran khan: రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఫొటో దిగేందుకు ఉద్యోగి కోటు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్!
- జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఇమ్రాన్
- ఉద్యోగి కోటు ధరించి ఫొటో
- ఈ నెల 18న ప్రధానిగా ప్రమాణ స్వీకారం
పార్లమెంటరీ రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఫొటో దిగేందుకు పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ ఉద్యోగి కోటు తీసుకుని ధరించడం వైరల్ అవుతోంది. ఇమ్రాన్ సోమవారం జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఆయన ఫొటో దిగాల్సి వచ్చింది. తెలుపు రంగు సల్వార్ కమీజ్తో వచ్చిన ఆయన ఫొటో కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఓ ఉద్యోగి నుంచి కోటు అడిగి తీసుకున్నారు. దానిని ధరించి ఫొటో దిగారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. స్టూలుపై కూర్చుని ఫొటో దిగుతున్న ఆయన ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి.
జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీకి ఇమ్రాన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫొటో దిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ ఈనెల 18న పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.