kcr: వచ్చే సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది: సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
- ముగిసిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం
- 9 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించాం
వచ్చే సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. అనంతరం, ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఈ మధ్య పేపర్లలో ఊహాగానాలు వస్తున్నాయని, అందుకే, ఈ విషయమై స్పష్టత ఇస్తున్నామని చెప్పారు.
ఈ నిర్ణయంలో తిరుగులేదని, ఎటువంటి మార్పూ ఉండదని అన్నారు. సెప్టెంబరులోనే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని, మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అభ్యర్థుల ప్రకటనకు అవసరమైన వేదికలను కీలక నేతలు చూస్తారని చెప్పారు. సెప్టెంబర్ 2న ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో భారీ ఎత్తున ప్రగతి నిర్వహణ సభ నిర్వహిస్తామని,1500 ఎకరాల విస్తీర్ణం ఉండే చోటే ఈ సభ నిర్వహిస్తామని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం ఇది అని చెప్పారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని, 9 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించామని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వనప్పటికీ రూ.20 వేల కోట్లు ఇవ్వాలని, వరి, మొక్క ధాన్యాలకు మద్దతు ధర రూ.2 వేల చొప్పున ఉండాలని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని కోరతామని చెప్పారు.