Chandrababu: ఆర్థిక వృద్ధికి నూతన పాలసీలు రూపొందించాలని ఏపీ మంత్రి యనమల ఆదేశం!
- ఆర్థిక వృద్ధిరేటుపై సమీక్ష
- వృద్ధి రేటు సాధించడం కోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వండి
- నిధులు సమకూరుస్తామని మంత్రి హామీ
ఆర్థిక వృద్ధికి నూతన పాలసీలు రూపొందించాలని ప్రణాళికా శాఖ అధికారులను ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో ఈరోజు ఉదయం ఆయన ప్రణాళికాశాఖ అధికారులతో రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిరేటుపై సమీక్షించారు. స్థిరమైన వృద్ధి రేటు సాధించడం కోసం సూచనలు, సలహాలతో డెయిరీ, తయారీ రంగాలకు ప్రత్యేక పాలసీలు రూపొందించమని ఆదేశించారు. ఆ తరువాత వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపించి ఆమోదం పొందుదామన్నారు. స్థిరమైన రెండంకెల వృద్ధి రేటుని కొనసాగించడానికి, ఇంకా పెంచడానికి శాఖలవారీగా సమావేశాలు నిర్వహించమని చెప్పారు.
అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వమన్నారు. వృద్ధిరేటు పెరగడానికి అవకాశం ఉన్న శాఖలకు కావలసిన నిధులు సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రంగాల వారీగా మొదటి త్రైమాసిక వృద్ధిరేటుని సమీక్షించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జిల్లాలో పెరిగిన ఆయకట్టుని సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటలు పండించే ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, వరద ముప్పు ఉన్న మండలాల గురించి అధికారులతో మంత్రి యనమల చర్చించారు. ఈ సమావేశంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, ఆర్థిక, గణాంక విభాగం డైరెక్టర్ ఎన్.యోగేశ్వర శాస్త్రి, సలహాదారు డాక్టర్ డి.దక్షిణామూర్తి, డిప్యూటీ డైరెక్టర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.