Chandrababu': బెల్టు షాపులు, నాటుసారా, గంజాయి సాగు నివారణకు పటిష్ట చర్యలు: ఏపీ మంత్రి జవహర్
- బెల్టు షాపులు, నాటుసారా తయారీ, గంజాయి సాగు నివారణే మా లక్ష్యం
- వీటిని నివారించేందుకు ప్రజల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు
- నాణ్యతతో కూడిన మద్యాన్ని విక్రయించేందుకు అవసరమైన చర్యలు
రాష్ట్రంలో బెల్టు షాపులు, నాటుసారా తయారీ, గంజాయి సాగు నివారణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఏపీ మంత్రి కె.ఎస్.జవహర్ స్పష్టం చేశారు. ఈమేరకు ఈరోజు అమరావతి సచివాలయంలోని నాల్గవ బ్లాకు పబ్లిసిటీ సెల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్టు షాపుల నివారణ, నాటుసారా తయారీ, గంజాయి సాగును పూర్తిగా నివారించేందుకు ప్రజల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే 9 జిల్లాల్లో ఈ విధమైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, మిగతా నాలుగు జిల్లాల్లోను ఈ కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం భావించడం లేదని ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. నాణ్యతతో కూడిన మద్యాన్ని విక్రయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. హోలోగ్రాము నెట్ వర్కు సమస్య వచ్చిందని దానిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. గంజాయి సాగును పూర్తిగా అదుపు చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జవహర్ స్పష్టం చేశారు.