Hyderabad: ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను పూర్తిగా విస్మరిస్తున్నాయి: రాహుల్ గాంధీ

  • మహిళాభివృద్ధి చెందకుండా దేశం ముందుకు సాగదు
  • మోదీ, కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కావట్లేదు
  • ‘కాంగ్రెస్’అధికారంలోకొస్తే అసలైన జీఎస్టీ అమలు చేస్తాం

ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను పూర్తిగా విస్మరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శంషాబాద్ లోని కన్వెన్షన్ హాల్ లో మహిళా స్వయం సహాయ బృందాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి చెందకుండా దేశం ముందుకు సాగదని, మహిళలను వంటింటికే పరిమితం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాలు చూస్తున్నాయని, దేశానికి మోదీ ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదని విమర్శించారు. ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటుపరం చేస్తున్నాయని, పేదలకు విద్య అందని ద్రాక్షగానే మిగిలిందని అన్నారు.

 జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాదని, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే అసలైన జీఎస్టీని అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై రాహుల్ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిస్తోందని, ఈ రాష్ట్రంలో ఒకే కుటుంబం బాగుపడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News