modi: మోదీ పాలనలో రుణాలు మాఫీ అయ్యేది పారిశ్రామికవేత్తలకే!: రాహుల్ గాంధీ
- మహిళలకు, రైతులకు మాత్రం రుణాలు మాఫీ కావు!
- మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి
- మహిళలను ఎలా అభివృద్ధి పరచాలో మాకు తెలుసు
మోదీ పాలనలో రుణాలు మాఫీ అయ్యేది పారిశ్రామికవేత్తలకే తప్ప మహిళలకు, రైతులకు, స్వయం సహాయక బృందాలకు మాత్రం కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శంషాబాద్ లోని కన్వెన్షన్ హాల్ లో మహిళా స్వయం సహాయ బృందాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, రెండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.2.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని విమర్శించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అభయహస్తం పింఛన్ పథకాన్ని, పావలా వడ్డీ రుణాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దేశం ముందుకు సాగాలంటే మహిళలు, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని, మహిళలను ఎలా అభివృద్ధి పరచాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని చెప్పారు. మహిళలకు, రైతులకు, స్వయం సహాయక బృందాలకు మాత్రం రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు రుణ సౌకర్యం కల్పిస్తామని, డ్వాక్రా మహిళలే ఉద్యోగాలు ఇచ్చేలా స్వయం సాధికారత సాధించేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.