kcr: కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మహిళా స్వయం సహాయ బృందాలతో సమావేశం
- ఆరు లక్షల మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తున్నారు
- మహిళా శక్తిని కేసీఆర్ కుటుంబానికి చూపెట్టాలి
నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శంషాబాద్ లోని కన్వెన్షన్ హాల్ లో మహిళా స్వయం సహాయ బృందాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మహిళా సంఘాలకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారని అన్నారు.
ఆరు లక్షల మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేరని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మహిళా శక్తిని కేసీఆర్ కుటుంబానికి చూపెట్టాలని పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే ఆరు లక్షల మహిళా సంఘాలకు లక్ష రూపాయల చొప్పున గ్రాంట్ ఇస్తామని, వారికి ఇచ్చే వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తుందని, ‘అభయహస్తం’ పెన్షన్ పథకాన్ని పునురుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.