Pakistan: మా జైళ్లలో ఉన్న 30 మంది భారతీయులను విడుదల చేస్తున్నాం!: పాకిస్తాన్ ప్రకటన
- భారత అధికారులకు అప్పగించనున్న పాక్
- మానవతా దృక్పథంతో విడుదల చేశామని వెల్లడి
- ఇంకా అక్కడి జైళ్లలో వందలాది మంది భారతీయులు
పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 30 మంది భారతీయులను రేపు విడుదల చేయనున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ప్రకటించారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్ట్ 14న వీరిని భారత అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. ఈ 30 మంది ఖైదీల్లో 27 మంది పాక్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన భారత జాలర్లని పేర్కొన్నారు.
పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులను మానవతా దృక్పథంతో విడుదల చేసినట్లు ఫైజల్ తెలిపారు. ఇందుకు ఎటువంటి రాజకీయ కారణం లేదని స్పష్టం చేశారు. భారత్ కూడా పాక్ లాగే వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పాక్ జైళ్లలో 470 మంది భారతీయులు ఉండగా, వీరిలో 418 మంది జాలర్లే ఉన్నట్లు సుప్రీంకోర్టులో గత నెలలో కేంద్రం ఓ నివేదికను సమర్పించింది. పాక్ ప్రధానిగా పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్(65) ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఖైదీలను విడుదల చేస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి.