jc prabhakar reddy: నా కుమారుడు ఎమ్మెల్యేగా, నేను కౌన్సిలర్ గా పోటీ చేస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన
- రాజకీయాల్లోకి మరో వారసుడు
- తాడిపత్రి నుంచి అశ్మిత్ బరిలోకి దిగుతాడన్న ప్రభాకర్ రెడ్డి
- నా కుమారుడిపై కూడా అదే ప్రేమాభిమానాలను చూపాలంటూ ప్రజలకు విన్నపం
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆయన తెలిపారు. తనపై ఇప్పటివరకు చూపిన ఆదరాభిమానాలను తన కుమారుడిపై కూడా చూపాలని పార్టీ శ్రేణులను, మద్దతుదారులను కోరారు. అశ్మిత్ ఇప్పటికే ప్రజా సేవలో ఉన్నాడని, 'స్పర్శ' స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలకు చేయూతనందిస్తున్నాడని తెలిపారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేస్తానని, కౌన్సిలర్ గా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి, తాడిపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తన లక్షణాలనే పుణికిపుచ్చుకున్న అశ్మిత్... తాడిపత్రి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ఇతర నియోజకవర్గాలకు మార్గదర్శంగా నిలుస్తాడని చెప్పారు.